‘బెల్టు’ బంధంపై ఏసీబీ కన్ను

విజయవాడ: మద్యం షాపుల టెండర్లు జరిగిన తీరు.. సిండి‘కేట్ల’ వ్యవహారాలు.. పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారుల మామూళ్లు.. మద్యం దుకాణాల లెసైన్సు పొందిన తెల్లకార్డుదారుల వివరాలు.. వీటన్నింటిపై ఏసీబీ చేస్తున్న దర్యాప్తు తీరు ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. తాజాగా జిల్లాలో బెల్టు షాపుల లెక్కలపై వివరాల సేకరణకు రంగంలో దిగడం, ఇందుకు క్షేత్ర స్థాయిలోని రెవెన్యూ అధికారుల సాయం కోరడంపై సర్వత్రా సందేహాలు తలెత్తుతున్నాయి. ఎక్సైజ్ అధికారులకు తెలియకుండా బెల్టు షాపుల సమాచారంపై పరిశీలనకు ఉపక్రమించడం అటు ఎక్సైజ్ అధికారులతో పాటు ఇటు మద్యం సిండికేట్లలో ఆందోళన మొదలైంది.
మద్యం టెండర్ల సమయంలో పలు కీలక రికార్డులు స్వాధీనం చేసుకుని స్క్రూటినీ చేసినా ఫలితం దక్కలేదు. తెల్లకార్డుదారుల వివరాలు సేకరించి, బినామీలను గుర్తించినా ఏం చేయలేదు. బెల్టు షాపుల నిర్వాహకుల వివరాలు, ఎన్నేళ్ల నుంచి బెల్టు షాపు నిర్వహిస్తున్నారు? ఆదాయం ఎలా ఉంది తదితర అంశాలపై వీఆర్వోలకు ఏసీబీ ఓ ప్రొఫార్మా పంపినట్లు సమాచారం. వారం వ్యవధిలో వీరు పూర్తి స్థాయి సమాచారాన్ని ఏసీబీకి అందించాల్సి ఉంది.
కొత్త పాలసీలో ఏసీబీ భాగస్వామ్యమా?
ఇంతవరకు మద్యం విధానం అస్తవ్యస్తంగా ఉంది. ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగానే చూడడం కారణంగానే దిగువ స్థాయి వరకు అక్రమాలు చోటు చేసుకున్నాయి. కొత్త మద్యం పాలసీ రూపొందిస్తున్న తరుణంలో ఏసీబీ ఎక్సైజ్ శాఖపై పూర్తి స్థాయి దృష్టి సారించి లోపాలు, అక్రమాలపై సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపించనుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కొత్త మద్యం పాలసీ తయారీలో ఏసీబీ తన వంతు పాత్ర పోషిస్తుందని ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ‘న్యూస్‌లైన్’తో వ్యాఖ్యానించారు.
జిల్లాలో ఇదీ ‘బెల్టు’ పరిస్థితి
జిల్లాలో ఒక్కో మద్యం దుకాణాన్ని వేలంలో రూ. కోటికి పైగా పాడుకొన్నవారు వీటికి అనుబంధంగా బెల్టు షాపులు నిర్వహించేందుకు అనధికారికంగా వేలం పాటలు నిర్వహించి సొమ్ము చేసుకున్నారు. ఏటేటా పెరుగుతున్న లక్ష్యాలకు ఎక్సైజ్ అధికారులు కిమ్మనడం లేదు. జిల్లాలో 335 మద్యం దుకాణాలు, 166 బార్లున్నాయి. బెల్టు షాపులు 4 వేలకు పైగానే ఉన్నాయి. 335 దుకాణాలకు లెసైన్సుల ఫీజుల రూపంలో ఏడాదికి రూ. 500 కోట్లు, అమ్మకాలపై రూ. 500 కోట్లు జిల్లాలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. గతేడాది జనవరి వరకు రూ. 541 కోట్ల ఆదాయం ఉంటే, ఈ ఏడాది జనవరి వరకు రూ. 611 కోట్ల ఆదాయం సమకూరింది.
అంటే రూ. 72 కోట్లకు పైగా ఆదాయం అధికంగా వచ్చింది. ఏసీబీ దాడులు జరిగినా, ఆదాయం పెంచుకోగలిగారంటే పల్లెల్లో బెల్టు షాపుల చలవతోనే. గ్రామాల్లో బెల్టు షాపు నుంచి నెలకు రూ. 50 వేల నుంచి రూ. లక్షన్నర వరకు ఆదాయం వస్తుండటంతో వీటి ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నారు. బెల్లం ఊటలు, సారా బట్టీలపై దాడులు చేసి కేసులు నమోదు చేసే ఎక్సైజ్ శాఖ ఒక్క గొలుసు దుకాణంపైనా దాడులు చేయడం లేదంటే వీరి ‘బెల్టు’ బంధం ఎంత పటిష్టంగా ఉందో అర్థమవుతోంది.